ముంబై: కోవిడ్-19 భయాలతో దలాల్ స్ట్రీట్ గజగజ వణుకుతోంది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ మార్కెట్లతోపాటు, దేశీయ స్టాక్‌మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. దీంతో ఈ వారంలో కూడా కీలక సూచీలు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుస నష్టాలతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. ముఖ్యంగా ఈ వారంలో నాలుగు రోజుల వ్యవధిలో రూ.19.49 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. దీనికితోడు భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, మరణాలు ఇన్వెస్టర్లలో తీవ్ర నిరాశను నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో ఆరంభంలోనే నష్టాల బాట పట్టాయి. మిడ్ సెషన్‌లో కొంత పుంజుకున్నప్పటికీ, ప్రధాన మద్దతు స్థాయిలను నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందాయి. అయితే షార్ట్ కవరింగ్ ప్రభావంగానే రికవరీ వచ్చిందనీ, ఇన్వెస్టర్ల అప్రమత్తత రానున్న కాలంలో కొనసాగుతుందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
కరోనా: 4 రోజుల్లో రూ.19.49 లక్షల కోట్లు ఆవిరి